ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కీలక సమీక్షలు జరపడంతో పాటు నియోజకవర్గ ప్రజలను నేరుగా కలవనున్నారు. రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
స్థానికుల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు అక్కడికక్కడే ‘ప్రజాదర్బార్’ కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ బлоపేతం, భవిష్యత్తు కార్యాచరణపై స్థానిక కేడర్‌కు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా రెండో రోజైన జూన్ 24 (బుధవారం) ఉదయం వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని జగన్ సందర్శించనున్నారు. అక్కడ స్వామివారికి జరిగే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.
గుడి దర్శనం ముగించుకుని మధ్యాహ్నానికి మళ్లీ పులివెందుల క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుంటారు. ఆ రోజు మొత్తం ప్రజలు, పార్టీ శ్రేణులతో ముఖాముఖి మాట్లాడటంతో పాటు.. ఉమ్మడి కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. అనంతరం మూడు రోజుల పర్యటన ముగించుకుని జూన్ 25వ తేదీ గురువారం ఉదయం పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.









