గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలనం: సస్పెండైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్!

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం, తదుపరి విచారణ నిమిత్తం నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుంది.

సీఐ నాగరాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియడంతో ఆయన మద్దతుదారులు, అనుచరులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. సిట్ అధికారులు నాగరాజును వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా, అనుచరులు ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు అనుకూలంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం నాగరాజు అనుచరులు విజయవాడలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

గత నెల మే 9వ తేదీన సీఐ నాగరాజు బృందం గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకుందని, అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల కస్టడీలోనే తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్లే సాయికృష్ణ మరణించాడని, ఆపై సాక్ష్యాలు లేకుండా మృతదేహాన్ని కూడా మాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపడంతో స్పందించిన ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు తాజాగా సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు