రజతోత్సవ సంబరాల్లో బసవతారకం ఆసుపత్రి: 25 ఏళ్ల సేవా ప్రస్థానం.. అమరావతిలో 1000 పడకల కొత్త వెంచర్!

క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఏ ఒక్క పేదవాడు ప్రాణాలు కోల్పోకూడదనే ఉన్నత ఆశయంతో ప్రారంభమైన ‘బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మహానాయకుడు ఎన్టీఆర్ తన భార్య స్మారకార్థం పునాది వేసిన ఈ సంస్థ రజతోత్సవ వేడుకలను సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మాతృమూర్తి ఆశయాలకు కట్టుబడి ట్రస్ట్ చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో ఈ ఆసుపత్రి గత పావు శతాబ్దంగా లక్షలాది మంది బాధితులకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందిస్తూ ఒక గొప్ప సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తోంది.

ఈ 25 ఏళ్ల ప్రయాణంలో బసవతారకం ఆసుపత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు సైతం ఆశాదీపంగా నిలిచింది. ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు 3 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లకు, 90 వేల మంది ఇన్ పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందుతుండగా.. అందులో 65 శాతం కంటే ఎక్కువ మంది నిరుపేదలే కావడం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత వైద్య సేవలు అందిస్తూ, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ నివారణను ఈ సంస్థ ఒక సామాజిక ఉద్యమంగా మార్చింది.

ఈ రజతోత్సవ శుభవేళ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 1,000 పడకలతో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ట్రస్ట్ సభ్యురాలు నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. క్యాన్సర్ బాధితులకు కొత్త జీవితాన్ని ఇచ్చే ఈ సేవా ప్రయాణంలో తమ కుటుంబం మూడు తరాలుగా భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. ఈ రజతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని 45,000 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు