పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు కార్మికులు సజీవ దహనం, సీఎం చంద్రబాబు తీవ్ర విచారం!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గల ‘దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి మంటలు వ్యాపించడంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో ఉన్న మిగతా కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీసినప్పటికీ, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. గాయపడిన బాధితులను తక్షణమే సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ ప్రమాద ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర సాంకేతిక విచారణ జరపాలని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు