ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ పనులు దక్షిణ భారత జలవనరుల చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. ఈ 33 కొత్త గేట్ల ప్రారంభంతో మూడు రాష్ట్రాల పరిధిలోని మూడు తరాల రైతులకు సంబంధించిన సాగునీటి, తాగునీటి భద్రత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోందని అన్నారు. ఇది కేవలం ఒక ఇంజినీరింగ్ విజయం మాత్రమే కాదని, మూడు రాష్ట్రాల కరవు జిల్లాల రైతాంగ భవిష్యత్తుకు కొత్త ఆశలు నింపే మైలురాయి అని పేర్కొన్నారు. ఇదే సమన్వయ స్ఫూర్తితో రాజకీయాలు, వివాదాలను పక్కనబెట్టి కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు.
గతంలో 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో భారీగా నీరు వృధా కావడంతో పాటు దిగువ ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా, రాబోయే 55 నుంచి 60 సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండేలా ఈ సరికొత్త గేట్లను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త గేట్ల ఏర్పాటుతో రాయలసీమ, పాలమూరు సహా కర్ణాటకలోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు వరద ముప్పు తగ్గి, సాగునీటి లభ్యత మరింత మెరుగవుతుందని మూడు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.









