మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంలోని పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉండి, ఆసరా కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రజలతో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన సిబ్బందిని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఉద్దేశించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని స్టేషన్లలో రిసెప్షనిస్టులు, అడ్మిన్ ఎస్సైల ప్రవర్తన, సమయపాలన సరిగా లేకపోవడాన్ని తప్పుబడుతూ, పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు కూడా జారీ చేశారు.

స్టేషన్లలో సిబ్బంది పనితీరుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీపీ ఒక వినూత్నమైన ‘డెకాయ్ ఆపరేషన్’ (రహస్య తనిఖీలు) వ్యూహాన్ని అమలు చేశారు. కొందరు పోలీసు అధికారులనే సాధారణ పౌరులుగా, సివిల్ డ్రెస్‌లో ఫిర్యాదులు చేసేందుకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ రహస్య ఆపరేషన్‌లో దాదాపు 12 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది తీరు దారుణంగా ఉన్నట్లు వెల్లడైంది. బాధితులతో రిసెప్షనిస్టులు కఠినంగా మాట్లాడటం, కేసు తమ పరిధిలోకి రాదంటూ పక్క స్టేషన్లకు నెట్టేయడం, మరియు ‘రేపు రా.. మాపు రా..’ అంటూ రోజులు తరబడి తిప్పించుకుంటూ వేధిస్తున్నట్లు ఈ తనిఖీ నివేదికల్లో స్పష్టంగా బయటపడింది.

ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీపీ సజ్జనార్ భావోద్వేగంగా మాట్లాడుతూ, “మీ కుటుంబ సభ్యులే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదురైతే మీరెలా భావిస్తారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి” అని హితవు పలికారు. ప్రజల సమస్యల పట్ల అలసత్వం వహించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించే సిబ్బందికి ఇకపై సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలని, స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వాతావరణంలో తగిన న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు