వరంగల్ జిల్లాలో ‘బంగారు’ భూమి కలకలం.. గుప్తనిధుల కోసం అర్ధరాత్రుళ్లు తవ్వకాలు!

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఓ ఆరెకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పంటలు బాగా పండే భూములకు డిమాండ్ ఉంటుంది, కానీ ఈ పొలంలో పురాతన బంగారు ఆభరణాలు బయటపడటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనే ఆశతో స్థానికులు దీనిపై పడ్డారు. ఇటీవల ఈర్యతండాకు చెందిన ఒక కౌలు రైతు సాగు చేస్తున్న పత్తి చేనులో మహిళా కూలీలు కలుపు తీస్తుండగా, అనుకోకుండా పురాతన కాలం నాటి బంగారు ఆభరణాలు లభించడంతో ఈ లంకెబిందెల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ భూమిలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని, శతాబ్దాల క్రితం ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉండేవని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో 1991లో అప్పటి భూ యజమానికి, ఆ తర్వాత అక్కడ పనిచేసిన ఒక పాలేరుకు కూడా వ్యవసాయ పనుల్లో భాగంగా పెద్ద మొత్తంలో బంగారు నాణేలు, దేవతా విగ్రహాలు లభించాయి. తాజా ఘటనతో ఈ భూమి కింద ఇంకా పెద్ద ఎత్తున గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం జోరందుకోగా, ఈ నిధిపై చట్టపరంగా తమకే హక్కు ఉందంటూ ఆ భూమిని గతంలో అమ్మేసిన పాత యజమాని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హక్కుల పోరాటం మొదలైంది.

పొలంలో బంగారం దొరికిందనే వార్త చుట్టుపక్కల గ్రామాలకు దావాగ్నిలా వ్యాపించడంతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఆ పొలానికి క్యూ కడుతున్నారు. పగటిపూట పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుండటంతో, జనం అర్ధరాత్రుళ్లు టార్చ్ లైట్లు, గునపాలతో పొలంలోకి చొరబడి నిధి కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. ఓవైపు నిధి హక్కులపై పాత, కొత్త యజమానుల మధ్య వివాదం, మరోవైపు జనం అర్ధరాత్రి వేళల్లో చేస్తున్న అక్రమ తవ్వకాలతో ఈ ‘బంగారు’ భూమి వ్యవహారం ప్రస్తుతం జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు