జగన్ చెప్పే ‘మావిగన్’ పేరు వింటేనే నవ్వు వస్తుంది: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తాము ‘మావిగన్’కే కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చెబుతున్న ‘మావిగన్’ అనే పేరు వింటేనే తనకు నవ్వొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలు ప్రజలు అంగీకరించే విధంగా, ఆచరణాత్మకంగా ఉండాలి తప్ప ఇలా హాస్యాస్పదంగా ఉండకూడదని హితవు పలికారు.

రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతిపై మళ్లీ బురదజల్లేందుకే జగన్ ఈ సరికొత్త డ్రామాకు తెరలేపారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. గతంలో ‘మూడు రాజధానులు’ అంటూ కొత్త ముచ్చట చెబితే, రాష్ట్ర ప్రజలు ఆ విషయాన్ని తిరస్కరించి గత ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం సరికొత్తగా ‘మావిగన్’ అనే పేరును తెరపైకి తెచ్చి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిని దెబ్బతీయాలని చూస్తే రాబోయే రోజుల్లో జగన్‌కు ఈ ‘మావిగన్’ అంశమే రాజకీయంగా తీవ్ర హానికరంగా మారుతుందని విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్‌ను చేర్చుతామని జగన్ ప్రకటించడంపై స్పందిస్తూ.. ప్రజలు ఇలాంటి మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ముందుకు సాగుతున్న తరుణంలో, మళ్లీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు