రాయలసీమ ప్రజల దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో మరో చారిత్రాత్మక అడుగు పడిందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశామని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో విజయనగరంలో జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు పనులను కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్, 350 మెగావాట్ల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్ పనులకు ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీనిపై లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమ ప్రాంతం ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ స్టీల్ ప్లాంట్ నిదర్శనమని లోకేశ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు.









