సైకో హంతకుడి మనస్తత్వానికి, జగన్ వైఖరికి దగ్గరి పోలికలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు

వైసీపీకి అసలు ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలే లేవని, అదొక ‘గొడ్డలి పార్టీ’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ షాబాద్‌లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. కక్షతో కన్నవారిని, ఎదుటివారిని మట్టుబెట్టిన ఆ హంతకుడి సైకో మనస్తత్వానికీ, సొంత బాబాయి హత్య ఉదంతం, కన్నతల్లి, చెల్లి విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల విలువైన రాష్ట్ర సహజ సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, జగన్ మరియు ఆయన కుటుంబ వైఖరి వల్ల ఎంతోమంది సమర్థులైన ఐఏఎస్ అధికారులు బలవగా, వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులను బెదిరిస్తూ పరిశ్రమలను తరిమేయడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం సృష్టించి పక్క రాష్ట్రమైన బెంగళూరులో తలదాచుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని, వారి నైజం అంతా ‘హిట్, రన్ అండ్ ఎస్కేప్’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి దిగడం, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఫేక్ ప్రచారాలు నిర్వహించడం సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఫేక్ పోస్టులను, తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు