వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక పిలుపు: మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

రాబోయే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించింది. మూసాపేట్‌లోని పుల్లారెడ్డి పాఠశాలలో సోమవారం (జూలై 20) ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు పాల్గొని ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ, యువతలో దేశభక్తిని పెంపొందించడం, సనాతన ధర్మం మరియు సాంస్కృతిక విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కుల వివక్షను రూపుమాపి హిందూ ఐక్యతను బలోపేతం చేసేందుకు సంత్ రవిదాస్ 650వ జయంతిని, అలాగే విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ జయంతిని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు యువత డీజే సంస్కృతికి దూరంగా ఉంటూ, దేశభక్తిని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే భజన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా, స్థానిక సంస్థల ద్వారా నిధుల కేటాయింపు జరపాలని, అలాగే పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 25న నిమజ్జన మహోత్సవం జరగనుంది. కాగా, హైదరాబాద్‌లో సుప్రసిద్ధమైన ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహా గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు సమితి ప్రతినిధులు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు