హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తోటి మహిళా అధికారితో శిక్షణ సమయంలో లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై కేసు నమోదైన మరుసటి రోజే (జూలై 20) ఈ ఘటన చోటుచేసుకుంది. మోతీనగర్‌లోని తన బంధువుల నివాసంలో ఉదయ్ కృష్ణారెడ్డి విషపూరిత పదార్థం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, గమనించిన బంధువులు వెంటనే ఆయనను ఎస్ఆర్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
బాధితురాలైన 30 ఏళ్ల మహిళా ఐపీఎస్ ట్రైనీ అధికారిణి ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. జూన్ 23 నుంచి జులై 10 మధ్య శిక్షణ సమయంలో అతను వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపాడని, తోటి ట్రైనీల ముందు తనపై తప్పుడు ప్రచారం చేశాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, తన ఫోన్ లాక్కుని బెదిరించడమే కాకుండా, తనకు తెలియకుండా తన ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో దాన్ని తన భర్తకు పంపాడని ఫిర్యాదులో వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66E, 67A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, 2013లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన ఆయన, ఐపీఎస్ లక్ష్యంతో 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడుసార్లు విఫలమైనా పట్టువదలకుండా, నాలుగో ప్రయత్నంలో ఐఆర్ఎంఎస్‌కు ఎంపికయ్యారు. అయినా సంతృప్తి చెందక, గత ఏడాది సివిల్స్‌లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన అసాధారణ విజయానికి ఏపీ సీఎం చంద్రబాబు సైతం గతంలో ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. అంతటి ప్రతిభావంతుడైన అధికారిపై ఇటువంటి తీవ్ర ఆరోపణలు రావడం, అనంతరం ఆయన ఆత్మహత్యకు యత్నించడం ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









