స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ వర్కర్లు, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా ఉదయం నుండి రాత్రి వరకు రోడ్లపై తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, వారికి లభిస్తున్న ఆదాయం కనీసం కుటుంబ కాలాన్ని వెళ్లదీయడానికి, నిత్యావసర ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
గత మూడేళ్లుగా సేవా ఛార్జీలను సవరించాలని ఈ కార్మికులు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రస్తుత ప్రభుత్వం వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కవిత మండిపడ్డారు. దీనికి తోడు అగ్రిగేటర్ యాజమాన్యాలు భారీగా కమీషన్ల కోత విధిస్తూ, అన్యాయంగా రేట్లను నియంత్రిస్తుండటంతో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంస్థల తీరును ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకోవాలని కోరారు.
గిగ్ వర్కర్లు, డ్రైవర్ల న్యాయమైన ప్రయోజనాల పక్షాన ప్రభుత్వం తక్షణమే నిలబడాలని, అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరిపి ఛార్జీలు పెంచేలా గట్టి చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా ‘వర్క్ బ్రేక్ డౌన్’ వంటి తీవ్రమైన నిరసనబాట పట్టే పరిస్థితి రాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు తమ హక్కుల కోసం చేస్తున్న ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.









