ఏసీబీ వలలో భారీ తిమింగలం: టీజీరెడ్కో డీజీఎం వెంకటరమణ అరెస్ట్.. రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో భారీ ఆపరేషన్ నిర్వహించి అవినీతి తిమింగలాన్ని పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) డీజీఎం ముత్యం వెంకటరమణను అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఏసీబీ జరిపిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఆయన వద్ద లభ్యమైన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి విలువ రూ.28 కోట్లుగా చూపించడం గమనార్హం.

వెంకటరమణ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాదాపు 14 గంటల పాటు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మాదాపూర్, కూకట్‌పల్లి, శేర్లింగంపల్లి, మూసాపేట వంటి హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన ప్లాట్లు, భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లోని రూ.52 లక్షల నగదు, 2,094 గ్రాముల బంగారం, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 19 విదేశీ మద్యం బాటిళ్లను కూడా సీజ్ చేశారు.

ముత్యం వెంకటరమణకు అవినీతి చరిత్ర కొత్తేమీ కాదని ఏసీబీ దర్యాప్తులో తేలింది. గతంలో ట్రాన్స్‌కోలో డీఈగా పనిచేసిన సమయంలో, 2019లో లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉండగానే, ఇప్పుడు మళ్లీ భారీ అక్రమాస్తుల కేసులో దొరికిపోవడం గమనార్హం. అంతేకాకుండా, ఆయన తన భార్య పేరు మీద ముత్యం కన్‌స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ సహా నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలను నడుపుతూ అక్రమ సంపాదనను మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. సుదీర్ఘ సోదాల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన ఏసీబీ, ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు