ఢిల్లీలో జరిగిన నీట్ ఆందోళనల్లో కేసీఆర్ ఎందుకు లేరు?: మహేశ్ కుమార్ గౌడ్

ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నీట్ ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఉన్న లోపాయకారీ ఒప్పందం కారణంగానే కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపలేకపోయారని ఆయన ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకుని, తమ ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని విమర్శించారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల వలే బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందనేది పచ్చి నిజమని, అందుకే గడిచిన పదేళ్లలో బీజేపీ ప్రతిపాదించిన బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

నెల రోజులుగా నీట్ సమస్యపై స్పందించని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కూర్చుని నాటకాలు ఆడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోకి వెళ్లే ధైర్యం వారికి ఉందా అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది విద్యార్థుల బలవన్మరణాలకు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పాలకులే బాధ్యులని ఆరోపించారు. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరుద్యోగులను వాడుకున్నారని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగిన పోలీసు రాజ్యం, విచ్చలవిడిగా జరిగిన ఇసుక మాఫియా దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం నీళ్ల ప్రాజెక్టుల గురించి హరీశ్ రావు మాట్లాడుతున్నారని, కానీ వారి పాలనలో నీళ్ల పేరుతో జరిగిన భారీ దోపిడీ, అక్రమాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లకపోయినా, నీట్ ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు