KTR: హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

హైడ్రాపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు హైడ్రా కమిషనర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను కేవలం ఒక బ్లాక్‌మెయిల్ సాధనంగా మార్చుకుని దుర్వినియోగం చేస్తోందని, హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన విమర్శించారు. ఢిల్లీ వేదికగా మాట్లాడిన ఆయన.. రియల్టర్లను, బిల్డర్లను భయపెట్టి ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేయడానికే హైడ్రాను ఒక వేటకుక్కలా ప్రయోగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలపై మౌనమెందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి నివాసంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు వంటి కీలక కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వానికి నిజంగానే పారదర్శకత ఉంటే వారి ఇళ్లపై కూడా బుల్డోజర్లు ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, ఈ హైడ్రా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆయన స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీకేజీపై కేంద్రంపై మండిపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై కూడా కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలోనే నీట్ పేపర్ ఏకంగా మూడుసార్లు లీక్ అయిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై దేశంలోని యువత నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అసమర్థత వల్ల విద్యార్థులకు సరైన మద్దతు ఇవ్వలేకపోయినప్పటికీ, విద్యార్థులే స్వయంగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు