అసెంబ్లీలో విద్వేష ప్రసంగాలకు చెక్: స్పీకర్ ఛాంబర్‌లో సెలెక్ట్ కమిటీ కీలక భేటీ

తెలంగాణ శాసనసభలో సభ్యుల వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలను నిరోధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో సెలెక్ట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరిగింది. సభలో ప్రజాప్రతినిధులు తమ భావప్రకటనా స్వేచ్ఛను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూనే, ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బలమైన చట్టాన్ని తీసుకురావడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవ లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్ రావు హాజరైన ఈ భేటీలో… విద్వేష ప్రసంగాలు, క్రైమ్ బిల్లు ప్రతిపాదనలపై సభ్యులు సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదించబోతున్న ఈ సరికొత్త చట్టం ఎవరి హక్కులనూ కాలరాయదని, కేవలం శాసనసభ గౌరవాన్ని, వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని కమిటీ భరోసా ఇచ్చింది.

శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ ‘క్రైమ్ అండ్ హేట్ స్పీచ్ బిల్లు’పై పూర్తి నివేదికను అసెంబ్లీకి సమర్పించే దిశగా కమిటీ కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికోసం వారం రోజుల్లో కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ లోగా వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు సమాజంలోని ప్రముఖులు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలను సేకరించి నివేదికను తుదిరూపు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు