సహచర మహిళా అధికారినే లైంగికంగా వేధించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 2025 బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో అతడిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ అత్తాపూర్/మహిళా సేఫ్టీ వింగ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఐపీఎస్‌కు ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్‌లోని పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతుండగా ఈ వేధింపులకు ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.
బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదు మేరకు జులై 18న కేసు నమోదు చేసిన పోలీసులు, జులై 28న ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. వీరిద్దరికీ 2023లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడగా, శిక్షణ సమయంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, ఆయుధాలు చూపి భయపెట్టడం మరియు బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలకు దిగాడని పోలీసు దర్యాప్తులో తేలింది. బాధితురాలికి వివాహం జరిగిన తర్వాత కూడా ఆమె ప్రైవేట్ చాట్లు, వీడియోలను బయటపెడతానంటూ బెదిరింపులకు గురిచేసి తీవ్ర మనోవేదనకు గురిచేసినట్లు అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
భారతీయ న్యాయ సంహితలోని లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో కస్టడీ విచారణ అత్యంత కీలకం కానుంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా నిందితుడి నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు డిజిటల్ సాక్ష్యాలు, డివైజ్‌లు మరియు సంభాషణలకు సంబంధించిన డేటాను రికవర్ చేసేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ఇలాంటి దారుణానికి పాల్పడటం పోలీస్ అకాడమీ వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది.









