మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించినన్ని యాగాలు దేశంలో మరెవరూ చేసి ఉండరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దైవబలం సిద్ధించాలంటే ముందుగా మానవ ప్రయత్నం ఉండాలని, యాగాలు నిర్వహిస్తూనే ప్రభుత్వాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేయడం సరికాదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేదని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి, ఆ జిల్లాకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గోదావరి బోర్డు సమావేశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారో నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం పేదలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ తరహాలోనే మరో భారీ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.









