రామ్ గోపాల్ వర్మ ‘పోలీస్ కంపెనీ’.. హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలో కొత్త సినిమా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తదుపరి చిత్రానికి ‘పోలీస్ కంపెనీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. “ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందనున్నట్లు వర్మ తెలిపారు. ముంబై అండర్‌వరల్డ్‌, పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో కథ సాగుతుందని, పోలీసులకు అదనపు అధికారాలు లభించినప్పుడు ఆ వ్యవస్థ ఒక సంస్థ నుంచి ‘కంపెనీ’గా మారే పరిస్థితి ఎలా ఏర్పడుతుందనే కోణంలో కథను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

దావూద్ ఇబ్రహీం ప్రత్యర్థి గ్యాంగ్‌లను అంతం చేసిన తర్వాత తన గ్యాంగ్‌ను ‘డీ కంపెనీ’గా మార్చడం, అనంతరం దుబాయ్‌కు వెళ్లడం, ఛోటా రాజన్‌ కార్యకలాపాలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను కథకు నేపథ్యంగా తీసుకున్నట్లు వర్మ వెల్లడించారు. వారి మధ్య విభేదాల తర్వాత ముంబై అండర్‌వరల్డ్‌లో ఏర్పడిన ఖాళీని ఇతర గ్యాంగ్‌లు భర్తీ చేయడంతో నేర కార్యకలాపాలు పెరిగిన పరిస్థితులను కూడా సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో అండర్‌వరల్డ్‌ను అడ్డుకునేందుకు 1997 నుంచి 2004 మధ్య ముంబైలో ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ ఏర్పాటు చేసిన ఘటనలను కూడా కథలో భాగం చేయనున్నట్లు వర్మ చెప్పారు. వందలాది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టిన ఆ పోలీస్ స్క్వాడ్‌ కార్యకలాపాల నుంచి స్ఫూర్తి పొంది ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక స్క్వాడ్‌లో పనిచేసిన పోలీస్ అధికారి దయా నాయక్‌ పాత్ర ఆధారంగా సినిమా రూపొందనుండగా, ఆ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటించనున్నారని వెల్లడించారు. భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నామని, మిగతా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని వర్మ తెలిపారు. అండర్‌వరల్డ్‌ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే వర్మ.. ఈసారి పోలీస్ స్క్వాడ్‌ నేపథ్యంలో ఎలాంటి కథను చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు