విజయ్ సర్కార్‌లో సినీ రంగానికి మరో కీలక పదవి.. అర్చన కల్పాత్తికి కమిటీలో చోటు

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని కీలక కమిటీలో ప్రముఖ సినీ నిర్మాత అర్చన కల్పాత్తిని సభ్యురాలిగా నియమించింది. రూ.10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం కలిగిన ప్రముఖ ఆలయాలకు నాన్-హెరిడిటరీ ట్రస్టీలను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మైలం బొమ్మపురం ఆధీనం శ్రీ శివజ్ఞాన బాలయ్యా స్వామి కమిటీకి ఛైర్మన్‌గా, రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో సినీ రంగానికి చెందిన మహిళా నిర్మాతకు చోటు కల్పించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అర్చన కల్పాత్తి నేతృత్వంలోని AGS ఎంటర్‌టైన్‌మెంట్స్ గతంలో విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ వంటి భారీ చిత్రాలను నిర్మించింది. కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అర్చన.. తమిళనాడులో మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్‌తో ఆమెకు ఉన్న సినీ అనుబంధం నేపథ్యంలో తాజా నియామకం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదే సమయంలో విజయ్ ప్రభుత్వంలో సినీ రంగానికి చెందిన వ్యక్తులకు వరుసగా కీలక బాధ్యతలు దక్కుతున్నాయనే చర్చ మొదలైంది. విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘జననాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ్‌ను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ మాజీ మేనేజర్, ‘ది రౌట్’ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థ అధినేత జగదీష్ పళనిస్వామికి ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా అర్చన కల్పాత్తికి దేవాదాయ శాఖ కమిటీలో చోటు దక్కడంతో.. విజయ్ సర్కార్‌లో సినీ ప్రముఖులకు లభిస్తున్న ప్రాధాన్యతపై తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు