హైదరాబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేసి, రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ముఠా గత రెండేళ్లుగా నగరంలో అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేస్తోంది. రోజుకు వెయ్యికి పైగా సిలిండర్లను తయారు చేసి, వాటిలో గ్యాస్ నింపి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి పోలీసులు 750 మినీ గ్యాస్ సిలిండర్లు, ఒక బొలేరో వాహనం, సిలిండర్ల తయారీకి ఉపయోగించే 7 యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్ల తయారీ, రవాణా, విక్రయాలు నిర్వహిస్తున్న ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.









