తెలంగాణలోని అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విధి నిర్వహణ ముగించుకుని పదవీ విరమణ పొందే అంగన్వాడీ సిబ్బందికి అందించే ‘సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్’ మొత్తాన్ని ప్రభుత్వం అధికారికంగా రెట్టింపు చేసింది. సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సిబ్బందికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పించాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నూతన నిబంధనల ప్రకారం, 65 ఏళ్ల వయోపరిమితి పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక ప్రయోజనం అందనుంది. గతంలో టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు మరియు మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలు మాత్రమే చెల్లించేవారు. అంతేకాకుండా, 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ (VRS) తీసుకునే సిబ్బందికి కూడా ఈ పెరిగిన బెనిఫిట్స్ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పెంచిన ఆర్థిక ప్రయోజనాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు నిధుల జమ ప్రక్రియను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 2,572 మంది సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.15.61 కోట్లను జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన వారికి సైతం ఈ ప్రయోజనాలు అందజేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు.









