మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్ల వేగం పెంచింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం గురువారం దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. గతంలో తాను ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ప్రధాని మోదీ తనకు ఎదురైన ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథను (ఇన్‌స్పిరేషనల్ స్టోరీ) తనతో షేర్ చేసుకున్నారని, ఆ కథకు తమ ‘పెద్ది’ సినిమాకు ఉన్న పోలికల గురించి చరణ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా విశేషాల గురించి అడిగారని చరణ్ చెప్పారు. ఈ సినిమా ‘వికసిత్ భారత్’ కాన్సెప్ట్‌కు అద్దం పడుతుందని, మన గ్రామాల్లోని మట్టిలో మాణిక్యాల లాంటి ప్రతిభావంతుల కథ అని తాను ప్రధానికి వివరించినట్లు తెలిపారు. ఆ సమయంలో మోదీ స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారని చరణ్ పేర్కొన్నారు. అక్కడ ఒక మారుమూల గ్రామానికి చెందిన ‘మహ్మద్’ అనే ఫుట్‌బాల్ ఆటగాడు దేశం తరఫున ఆడి తన ఊరికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడని, అతని స్ఫూర్తితోనే ఈరోజు ఆ చిన్న గ్రామం నుండి ఏకంగా 85 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ తయారయ్యారని ప్రధాని చెప్పినట్లు చరణ్ గుర్తు చేసుకున్నారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఆ కథే నిదర్శనమని, తమ ‘పెద్ది’ సినిమా కూడా ఒక గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి సాధించిన అద్భుతాల చుట్టూ తిరిగే కథేనని లింక్ చేస్తూ వివరించారు.
ఇక ఈ ఢిల్లీ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. సినిమాలో డ్యాన్స్ ఇరగదీశారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘మా ప్రొడ్యూసర్ మంచి పేమెంట్ ఇచ్చారు, అందుకే అలా చేశా’ అంటూ చరణ్ చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. మరోవైపు, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే పైరసీకి గురికాకుండా మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చిందని మేకర్స్ తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.









